PM Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి చివరి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలంగాణలో మోదీ పర్యటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మార్చి చివరి వారంలో ప్రధాని పర్యటనను బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
తెలంగాణ పర్యటన సందర్భంగా మోదీ దాదాపు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ మేరకు గతంలో కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ మేర డబ్లింగ్ రైల్వే లైన్‌ను మోదీ ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఐఐటీ హైదరాబాద్‌లోని అకడమిక్ భవనాలు, వసతి గృహాలు, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, అతిథిగృహం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ తదితర భవనాలను మోదీ ప్రారంభించాల్సి ఉంది.