Modi Praises Sircilla weaver in Mann Ki Baat : ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానన్న మోదీ.. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందని కొనియాడారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో వెల్లడించారని గుర్తు చేశారు.
Modi mentions Sircilla weaver in Mann Ki Baat : జీ-20 సమావేశ లోగోను చేనేతతో హరిప్రసాద్ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన పంపిన లేఖలో జీ-20 సమావేశం భారత్ ఆతిథ్యం ఇవ్వడం అద్భుతమని ప్రస్తావించినట్లు ప్రధాని వెల్లడించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త సొబగులు అద్దారని ప్రశంసించారు. తనకు పంపిన లేఖలో హరిప్రసాద్.. చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలు పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.