Plots Distribution in Amaravati R5 Zone: ఇళ్లు లేని నిరుపేదలకు అమరావతి రాజధాని ప్రాంతంలో పట్టాలిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ పదే పదే ప్రకటించడంతో.. అధికారులు.. విజయవాడ పరిధిలో 27 వేల మందిని, గుంటూరు పరిధిలోని 23 వేల మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాజధాని అమరావతిలోని ఆర్5 జోన్‌లో సెంటు పట్టాలకు జాబితా సిద్ధం చేశారు. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసినా ప్రభుత్వ ఆదేశంతో అత్యుత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. ఆ జాబితాలో వైసీపీ నేతలు చెప్పిన పేర్లన్నీ అడ్డగోలుగా చేర్చేశారు.
ఇప్పటికే ఇళ్లు, పొలాలు ఉన్నవారితో పాటు వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగులకూ పట్టాలు ఇచ్చేశారు . అధికార పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సూచించిన వారందరినీ లబ్ధిదారుల జాబితాలో చేర్చేశారు. వేలల్లో పట్టాలు ఇస్తుండడంతో ఎవరికిచ్చారనేది ఎవరు చూస్తారులే అనే ధీమా ప్రదర్శించి.. కొందరు ఉద్యోగుల కుటుంబసభ్యుల పేర్లనూ జాబితాలో ఎక్కించారు. నామినేటెడ్ పదవులున్న వైసీపీ నేతల కుటుంబసభ్యులకూ జాబితాలో చోటు దక్కిందంటేనే అక్రమాలు ఏమేరకు సాగాయో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ, గుంటూరు పరిధిలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు ఏదో ఒకటి ఇస్తామంటూ.. గతంలో హామీలు పొందిన చోటామోటా వైసీపీ నాయకులు చాలామందిని సెంటు పట్టాల జాబితాలో చేర్చేశారు. వీరికి ఏమీ చేయలేకపోయామని, కనీసం రాజధాని సెంటు పట్టాల జాబితాలో చోటు కల్పిస్తే ఎంతోకొంత లబ్ధి చేకూర్చినట్టవుతుందనే ఆలోచనతో అధికార పార్టీ నాయకులు వారిని అందులో చేర్చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సూచనలతో.. వైసీపీ చోటామోటా నేతల కుటుంబసభ్యులు చాలా మందికి పట్టాలు మంజూరు చేశారు. వీరు ఇల్లు లేని అర్హులైతే పర్వాలేదు. కానీ ఇళ్లు, కార్లు, స్థిరాస్తులు, మంచి వ్యాపారాలున్న వాళ్లూ ఉన్నారు. ఇప్పటికే టిడ్కో ఇళ్లు పొందినవారికీ సెంటు భూమి పట్టాలు ఇచ్చేశారు.
శాఖమూరు గ్రామానికి చెందిన నామినేటెడ్ పదవిలో ఉన్న వైసీపీ నాయకుడి భార్య పేరుతో సెంటు భూమి పట్టా మంజూరైంది. ఈ కుటుంబానికి కారు, ఇల్లు ఉంది. దొండపాడు, తుళ్లూరుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలకు అధికారులు సెంటు భూమి మంజూరు చేశారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నప్పటికీ పేదలకు ఇచ్చే ఇళ్ల జాబితాలో పేరు నమోదు చేశారు. దొండపాడు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న నేలపాడు మహిళకూ సెంటు భూమి లబ్ధిదారుల జాబితాలో చోటిచ్చారు.
తుళ్లూరు సచివాలయ పరిధిలో వాలంటీర్‌గా పని చేస్తున్న, పక్కా ఇల్లున్న వ్యక్తికీ సెంటు భూమి పట్టాల జాబితాలో చోటు కల్పించారు. తుళ్లూరు కమ్యూనిటీహాల్ సెంటర్‌లో అయిదంతస్తుల మేడ ఉన్న కుటుంబానికి సెంటు భూమి పట్టాదారుల జాబితాలో పేరు రాయడం అక్రమాలకు పరాకాష్ఠ. తుళ్లూరులో అయ్యన్న చెరువులో నివాసం ఉంటున్న మహిళకు గతంలో ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈమెనూ రాజధానిలో సెంటు భూమి లబ్ధిదారుల జాబితాలో చేర్చేశారు. వడ్డమానుకు చెందిన వైసీపీ గ్రామస్థాయి నాయకుడి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల పేరుతో రాజధాని ప్రాంతంలో సెంటు భూమి పట్టాలు రాసేశారు. వీరికి గ్రామంలో పక్కా ఇల్లు, భూములున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామ మహిళ కుటుంబసభ్యుల పేరుతో సెంటు భూమి పట్టా ఇచ్చారు. ఇదే గ్రామంలో వైసీపీ నాయకుడికి రెండతస్తుల డాబా ఉన్నప్పటికీ అతని తల్లి పేరుతో సెంటు పట్టా రాసేశారు. విజయవాడ పాతబస్తీ బ్రాహ్మణవీధిలో అధికార పార్టీ కీలక నాయకుడి ఇద్దరు కుమార్తెలకు పట్టాలు మంజూరయ్యాయి. విజయవాడకు చెందిన మాజీ మంత్రి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈ నాయకుడు గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేతకు సొంత నివాసమే కాక, వ్యాపారాలతో పాటు కారు కూడా ఉంది. ఆయన సోదరుడి కుమారుడి పేరుతో కూడా ఒక పట్టా మంజూరు చేయించుకున్నారు. వారికీ సొంతిల్లు ఉంది.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అనుచరుడు, పాతబస్తీ పంజాసెంటర్‌లో అధికార పార్టీ మైనారిటీ నాయకుడి కుమారుడి పేరుతో పట్టా మంజూరైంది. ఆయనకు సొంతిల్లు, నగరంలోని ప్రధాన కూడలిలో పెద్ద దుస్తుల వ్యాపారం ఉంది. నగరంలోని 51వ డివిజన్‌కు చెందిన 25 మందికి సెంటు భూమి పట్టాలు మంజూరయ్యాయి. వీరిలో ముగ్గురు అధికార పార్టీ క్రియాశీలక కార్యకర్తలు. ఈ ముగ్గురికీ సొంతిళ్లున్నాయి. వాటిలో వీరు నివాసం ఉండటంతోపాటు మరో రెండేసి ఇళ్లను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. ఈ ముగ్గురికీ ఆర్5 జోన్‌లో సెంటు భూమి పట్టాలు జారీ కావడంపై అధికార పార్టీ నాయకుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆరో డివిజన్ నిమ్మతోట సెంటర్ ఇజ్జాడ అప్పలనాయుడు వీధిలో సొంతిళ్లు ఉన్న నలుగురికి తాజాగా రాజధానిలో సెంటు స్థలాలు మంజూరయ్యాయి. స్థానిక వైసీపీ నేతకు అనుచరులుగా కావడంతో వీరికీ పట్టాలిచ్చేశారు.