గుంటూరు జిల్లాలో సుమారు 25 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కోవిడ్ మరణాల సంఖ్య 250కి చేరుకుంది. కేసుల పరంగా రాష్ట్రంలో నాలుగో స్థానం.. మరణాల పరంగా రెండో స్థానంలో జిల్లా నిలిచింది. రోజులో దాదాపు 700 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. చాలా వరకు బాధితులు కరోనా నుంచి కోలుకుంటుండడంతో ప్లాస్మా సేకరణను కూడా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.
ఇందు కోసం జిల్లా యంత్రాంగం రెండు కమిటీలను వేసింది. ప్లాస్మా సేకరణ, అందుకు అవసమరైన అనుమతులు, చికిత్స వంటి వాటిపై విధివిధానాలు రూపొందించారు. ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలతో పాటు, ప్రైవేటు ల్యాబుల ద్వారా ప్లాస్మా సేకరణ ప్రారంభించారు. జీజీహెచ్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ప్లాస్మా చికిత్స మొదలైంది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని గుర్తించి... వారికి ఈ తరహా చికిత్సను అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిస్తున్నారు.
అయితే.. అందరి నుంచి ప్లాస్మా తీసుకుని బాధితులకు ఎక్కించటం కుదరదు. రక్తం గ్రూపు ఒకటే అయి ఉండాలి. ప్లాస్మాదాత శరీరంలో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. ఐజీజీ రకం యాంటీబాడీస్ 40యూనిట్ల కంటే ఎక్కవగా ఉన్న వారినుంచి మాత్రమే ప్లాస్మా సేకరించి అవసరమైన వారికి ఎక్కిస్తారు. దీని కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సింగిల్ డోనర్ ప్లాస్మా పెరిసిస్ యంత్రంతో ప్లాస్మా సేకరణ
ప్లాస్మా సేకరణ కోసం సింగిల్ డోనర్ ప్లాస్మా పెరిసిస్ అనే యంత్రాన్ని వినియోగిస్తారు. ఒక్కొక్కరి నుంచి 400 ఎంఎల్ ప్లాస్మా తీసుకుంటారు. దాన్ని రెండు భాగాలుగా చేసి 200ఎంఎల్ చొప్పున ఇద్దరికి ఇవ్వవచ్చు. వైరస్ తీవ్రంగా ఉండి... కోవిడ్ పై పోరాడలేని వారికి ప్లాస్మాను ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారకి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇది అందిస్తే కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.