ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court: ఓటర్ల నమోదు ప్రక్రియపై పిల్​.. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు - స్థానిక వార్తలు

AP High Court: ఓటర్ల నమోదు ప్రక్రియ పారద్శకంగా నిర్వహించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, కృష్ణా జిల్లా కలెక్టర్(జిల్లా ఎన్నికల అధికారి), మచిలీపట్నం ఆర్డీవో(ఎన్నిలక రిజిస్ట్రేషన్ అధికారి), కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 19, 2023, 11:02 PM IST

notice to Election Commission: మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఒకే ఇంట్లో నివశిస్తున్న కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ బూత్లలో చేర్చడానికి కారణాలేంటి? ఒకే పేరును రెండు మూడుసార్లు ఎందుకు చేర్చారు? నిబంధనల మేరకు 2 కి.మీ పరిధిలో పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటే అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, కృష్ణా జిల్లా కలెక్టర్(జిల్లా ఎన్నికల అధికారి), మచిలీపట్నం ఆర్డీవో(ఎన్నిలక రిజిస్ట్రేషన్ అధికారి), కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. మచిలీపట్నంలో ఓటర్ల పరిశీలన ప్రక్రియ జరుగుతోందని పూర్తి వివరాలు కోర్టుముందు ఉంచేందుకు సమయం కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది శివదర్శన్ కోర్టుకు విన్నవించారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.

HC on kuppam elections: ఎన్నికల అధికారి ఉన్నప్పుడు..ప్రత్యేక అధికారి ఎందుకు?

మచిలీపట్నం శానససభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని, అర్హులకు ఓటు నిరాకరణ లేకుండా చూసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ మచిలీపట్నానికి చెందిన ఇమదాబత్తుల దిలీప్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఈసీ నిబంధనలను అధికారులు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. ఓటర్ల నమోదు నిబంధన 6 ప్రకారం.. ఒకే ఇంట్లో నివశిస్తున్న ఓటర్లకు ఒకే పోలింగ్ బూత్లో ఓటు హక్కు కల్పిచాల్సి ఉందన్నారు. మచిలీపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వేర్వేరు పోలింగ్ బూత్లు కేటాయించారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మాన్యువల్ ప్రకారం ఓటరు నివసించే ప్రాంతం నుంచి పోలింగ్ బూత్ కేవలం 2 కి.మీ పరిధిలో ఉండాలన్నారు. అందుకు భిన్నంగా దూరంగా ఉన్న పోలింగ్ బూత్​లను కేటాయించారన్నారు. ముసాయిదా ఓటరు జాబితా, తుది జాబితాలో చోటు చేసుకున్న లోపాలను ఎత్తిచూపుతూ ఓట్ల నమోదు అధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు.

అధికారపార్టీకి చెందిన పెద్దతలకాయల జోక్యంతో జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి చట్టనిబంధనలను ఖాతరు చేయడం లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈసీ జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా పారద్శకంగా ఓటరు నమోదు కార్యక్రమం, ఓటరు జాబితా సిద్ధం చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు హక్కు నిరాకరణకు గురికాకుండా చర్యలు తీసుకునేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది శివదర్శన్ స్పందిస్తూ.. మచిలీపట్నంలో ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details