అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పనులు 2011 సంవత్సరంలో ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతూనే, మరోవైపు మాచర్ల రోడ్డులోని ఖలీల్ రెస్టారెంట్ దగ్గర నుంచి గుంటూరు రోడ్డులోని రిలయెన్సు పెట్రోలు బంకు వరకు ఆరు కిలోమీటర్లు దూరం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2012లో గుత్తేదారు పనులు ప్రారంభించగా, భూములు, స్థలాలు కోల్పోయిన బాధితులు కోర్టుకు వెళ్లి నిర్మాణ పనులను నిలిపివేయించారు. ఎంత పరిహారం చెల్లించాలనే విషయంపై రెవెన్యూ అధికారులు పలుమార్లు బాధితులతో సమావేశాలు నిర్వహించారు. చివరకు కొంతమందికి 2016లో పరిహారం చెల్లించారు. 2017లో గుత్తేదారు నిర్మాణ పనులు ప్రారంభించి కొన్నాళ్లు చేశారు. గుత్తేదారునికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో నిర్మాణ పనులు ఆపివేశారు. మరలా 2019లో నిర్మాణ పనులను ప్రారంభించారు. కొన్ని రోజులు చేసి వదిలివేశారు. ఇంకా భూసేకరణ చేయాల్సి ఉందని, భూమి అప్పగిస్తే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు అంటున్నారు.
మలుపుల చిక్కులెన్నో...
బైపాస్ రోడ్డు నిర్మాణానికి 60 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2016లో 43 ఎకరాలు భూమికి పరిహారం చెల్లించారు. రోడ్డు నిర్మాణంలో 13.56 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా పోతుంది. అయితే ఖలీల్ రెస్టారెంట్ ఎదురు అసైన్డ్ భూమి 4.12 ఎకరాలు ఉంది. ఈ భూమిని చాలాకాలం నుంచి కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి పరిహారం చెల్లించాలని సాగు చేసుకునే రైతులు కోరుతున్నారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి పరిహారం ఇవ్వమని రెవెన్యూ అధికారులు సాగు చేసుకునే రైతులకు చెప్పారు. దీంతో 4.12 ఎకరాల భూమి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయకుండా అలాగే వదిలివేశారు.
రిలయన్స్ పెట్రోలు బంకు సమీపంలో 3.44 ఎకరాల భూమిని భూసేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో రైతులు, వ్యాపారులు రోడ్డు నిర్మాణంలో పోయే భూమికి గజాల లెక్కన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. కాని రెవెన్యూ అధికారులు మాత్రం ఎకరాల లెక్కన పరిహారం చెల్లిస్తామని అంటున్నారు. ఇక్కడ పరిహారం ఎంత ఇస్తారనేది తేలితే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.