గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భూవివాదాలు తారాస్థాయికి చేరాయి. కొద్దిరోజుల నుంచి తమ భూమిని కొంతమంది ఆక్రమించి.. చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు భానుప్రసాద్ వాపోయాడు. అధికారులకు తమ గోడు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారంటున్నాడు. మాపైనే కేసు పెడతావా అంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి, మూడేం శ్రీనివాస రెడ్డిలు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు అంటున్నాడు.
ఎమ్మెల్యే పేరు చెప్పి..
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు చెప్పి భయపెడుతున్నారని భానుప్రసాద్ భయాందోళనకు గురవుతున్నాడు. భూమి విషయమై భాదితుడు ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టారు. ఈలోపే అక్రమార్కులు ఎమ్మెల్యే పేరు చెప్పి ఫోన్లో బెదిరించడం గమనార్హం. రేపు భూమి వద్దకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.