ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం.. హైకోర్టులో న్యాయవాదుల వాదనలు - ఏపీ తాజా వార్తలు

HIGH COURT ON GOVT : విద్యా విధానాన్ని మెరుగుపరిచే పేరుతో పాఠశాల వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని హైకోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపించారు. విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో టీచర్ల సంఖ్యలో కోత విధించిందన్నారు. విద్యాబోధన పూర్తిగా ఆంగ్లమయం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తప్పుబట్టారు.

HIGH COURT ON GOVT
HIGH COURT ON GOVT

By

Published : Dec 29, 2022, 10:09 AM IST

HC ON GOVT : విద్యా విధానాన్ని మెరుగుపరిచే పేరుతో పాఠశాల వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. బుధవారం జరిగిన విచారణలో ఆయన వాదనలు ముగియడంతో మరో పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనల కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పాఠశాల విద్యా వ్యవస్థ నాశనమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిమిత్తం జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లను రద్దు చేయాలంటూ వైయస్‌ఆర్‌, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ బి.రమేశ్‌చంద్ర సింహగిరి పట్నాయక్‌, డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన విచారణలో సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు.

బాధ్యత నుంచి తప్పుకొంటున్న ప్రభుత్వం

‘ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత నుంచి తప్పుకొంటోంది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తోంది. ప్రాథమిక విద్య నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. చిన్నారులు కి.మీ. కొద్దీ దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా బడి దూరమవడంతో సుమారు 2 లక్షల మంది పిల్లలు చదువు మానుకునే పరిస్థితి తలెత్తింది. మరికొందరు తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేకున్నా పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేసి ఎయిడెడ్‌ పాఠశాలల వ్యవస్థను కుప్పకూల్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) మాతృభాషలో విద్యా బోధన ఉండాలని స్పష్టం చేస్తోంది. ఆ నిబంధనలను మార్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అలాంటి అధికారం రాష్ట్రానికి లేదు. విద్యా బోధనలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు పరోక్షంగా చర్యలు చేపట్టింది. 1 నుంచి 8వ తరగతి వరకు ఒకే మాధ్యమంలో విద్యా బోధన ఉంటుందని జీవోలో పేర్కొందే కానీ ఏ మాధ్యమంలో ఉంటుందో స్పష్టత ఇవ్వలేదు.

9, 10 తరగతులకు రెండు మాధ్యమాల్లో విద్యా బోధన ఉంటుందని.. కనీసం 20 మంది విద్యార్థులు ఆ మాధ్యమాన్ని ఎంచుకోవాలనే షరతు విధించింది. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను ఆంగ్ల పిచ్చివారిగా మార్చేలా ఉంది. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలన్న విద్యాహక్కు చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయండి’ అని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details