ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court : హైకోర్టులో ఎయిడెడ్ పాఠశాలల పిటిషన్.. హాజరైన జీఏడీ ఉన్నతాధికారులు రేవు ముత్యాలరాజు, పోలా భాస్కర్‌ - జీఏడీ అధికారి రేవు ముత్యాలరాజు హైకోర్టుకు హాజరు

AP High Court : కోర్టు ధిక్కరణ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు, జీఏడీ కార్యదర్శి పోలా భాస్కర్‌.. సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ జనవరిలో జారీ చేసిన జీవో 121ని ఉపసంహరించినట్లు తెలిపారు. మరోవైపు ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసుకునేందుకు పిటిషనర్‌ విద్యా సంస్థలను అనుమతించాలని 2013 ఆగస్టు 20న ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు.

Petition of aided schools in AP High Court
ఏపీ హైకోర్టులో ఎయిడెడ్ పాఠశాలల పిటిషన్

By

Published : Jul 4, 2023, 11:26 AM IST

AP High Court : కోర్టు ధిక్కరణ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు, జీఏడీ కార్యదర్శి పోలా భాస్కర్‌.. సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ జనవరిలో జారీ చేసిన జీవో 121ని ఉపసంహరించినట్లు తెలిపారు. జీవో ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నా ఆచరణలోకి రాలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక 121 జీవో అంశంపై దాఖలైన మరో వ్యాజ్యం సింగిల్‌ జడ్జి వద్దకు విచారణకు రాగా అన్నింటినీ కలిపి ఒకే న్యాయమూర్తి విచారణ చేసేలా పరిపాలనా నిర్ణయం తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి విన్నవించినట్లు ఐఏఎస్​ల తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై ఏసీజే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నివేదించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.

తదుపరి విచారణకు హాజరు నుంచి అధికారులకు మినహాయింపు ఇచ్చారు. 1999 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఆధారంగా అర్హత సాధించిన వారిని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లకు సంబంధించి మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం కాకుండా ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా పదోన్నతులు కల్పించబోతున్నారని గతేడాది పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. 2022 డిసెంబర్‌ 16న విచారణ జరిపిన హైకోర్టు మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వం జీవో 121 జారీ చేస్తూ ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా సెక్షన్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించిందంటూ కె.శ్రీహరిరావు సహా మరి కొందరు ఉద్యోగులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

హైకోర్టుకు హాజరైన ప్రవీణ్‌, ప్రకాశ్‌ సురేశ్‌కుమార్‌ :ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసుకునేందుకు పిటిషనర్‌ విద్యా సంస్థలను అనుమతించాలని 2013 ఆగస్టు 20న ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్‌ పాఠశాలలో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. మొత్తం 32 ఎయిడెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 24 పోస్టులను మిగులు ఉపాధ్యాయులతో మొదట భర్తీ చేసి మిగిలిన 8 పోస్టులను సెప్టెంబర్‌ మొదటి వారంలో భర్తీ చేస్తామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. హాజరు నుంచి వారికి మినహాయింపు ఇచ్చారు.

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోకు.. కోర్టుకు చెబుతున్న వివరాల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఒప్పంద పద్ధతిలో పోస్టులు భర్తీచేయాలని జీవోలో పేర్కొన్నారని, మిగులు టీచర్లతో భర్తీ చేస్తామని ప్రస్తుతం చెబుతున్నారన్నారు. మిగులు టీచర్లను కేటాయించిన అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేస్తామనే విషయాన్ని జీవోల్లో స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి.

విచారణ జరిపిన కోర్టు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పోస్టులు భర్తీకి అనుమతివ్వాలని 2013 ఆగస్టులో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో యాజమాన్యాలు 2020లో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశాయి. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం అధికారుల హాజరుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణకు ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details