స్నేహితుల మధ్య ఉన్న పాత కక్షల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన తురకకొండ (28)తో పాటు బాలకృష్ణ, సురేశ్, దేవల్ల కొండ అనే వ్యక్తులు రింగు రోడ్డులో ఉన్న దుకాణంలో మద్యం తాగారు. ఇంటికి వెళ్లే దారిలో బాలకృష్ణ, తురక కొండ మధ్య ఘర్షణ జరిగింది. సమీపంలో ఉన్న వారు వారికి సర్దిచెప్పి పంపించేశారు.
అక్కడి నుంచి తిరిగి రింగురోడ్డులోని మద్యం దుకాణానికే వెళ్లారు. షాపు వద్ద తురక కొండను రాయితో కొట్టి చంపారు. మిత్రులైన బాలకృష్ణ, సురేశ్, దేవల్ల కొండ పథకం ప్రకారం తన భర్తను హత్య చేశారంటూ మృతుడి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.