గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. మండలంలోని చాగంటివారిపాలెంకు చెందిన పుల్లా సాహెబ్ ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన సీతారామయ్య అనే వ్యాపారి వద్ద రూ. 7 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. పరికరాలు తెచ్చి ఇక్కడ సరఫరా చేశాక లాభాల్లో వాటా ఇస్తానన్నాడు. విశాఖ వెళ్తున్నట్లు చెప్పాడు.
అయితే ఈనెల 28న వెళ్లిన పుల్లా సాహెబ్ ఇప్పటి వరకూ రాలేదని.. అతని ఫోన్ పని చేయటం లేదని సీతారామయ్య సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే పుల్లా సాహెబ్ తల్లిదండ్రులూ తమ కుమారుడు 4 రోజులుగా కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సీతారామయ్యతో పాటు మరికొందరి వద్ద కూడా పుల్లా సాహెబ్ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ. 12కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇపుడు అతని అదృశ్యం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.