పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ.. వివాదాలకు దారి తీస్తోంది. పెనుగొండ మండలం దేవా గ్రామ పరిధిలోని వంగ తాళ్ల చెరువులో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగారు. మంచినీటి చెరువును పూడిక చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు మహిళలు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని ధర్నాకు దిగారు. ఇదే నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పంట పొలాలు పూడ్చేందుకు అధికారులు రహదారి నిర్మాణం చేపట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.
ప్లాట్లు తీసుకుంటే ప్రాణాలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారి పాలెం వాసులు అధికారులను హెచ్చరించారు. 40 ఏళ్ల క్రితం 130 మందికి ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ప్లాటు ఇచ్చారని... కొద్దిరోజులుగా వాటిని వేరే వారికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు.
కృష్ణా జిల్లాలో తెదేపా నేత తంగిరాల సౌమ్య.. లబ్ధిదారులను కలిశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో మాట్లాడిన ఆమె పేదల భూములను, స్థలాలను అధికారాన్ని ఉపయోగించి లాక్కోవాలనుకోవడం అన్యాయమని దుయ్యబట్టారు.