తాము నివాసముంటున్న గ్రామంలోనే తమకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ.. గుంటూరు జిల్లాలోని చిలువూరులో.. లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యను విన్నవించుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో నివాసముంటున్న 206 మందికి.. కంఠంరాజు కొండూరులో ఇళ్ల స్థలాలను కేటాయించారు. కొండూరులో లబ్ధిదారులకు కేటాయించిన జగనన్న కాలనీలో.. కనీస సదుపాయాలు లేవని లబ్ధిదారులు వాపోతున్నారు. వేరే గ్రామానికి చెందిన వారికి చిలువూరులో స్థలాలను కేటాయించి.. ఇక్కడ ఉన్నవారికి వేరే గ్రామంలో కేటాయించటం పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
చిలువూరులో నిత్యం కూలీ పనులు చేసుకుంటున్న తాము.. కొండూరులో ఇళ్ల స్థలాలను కేటాయిస్తే ఉపాధి కోల్పోతామని.. చిలువూరులోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. గతంలో జిల్లా స్థాయి అధికారి పర్యటనకు వచ్చిన సమయంలో.. తమ గోడును వెళ్లబుచ్చగా అధికారి స్పందించి చిలువూరులోనే స్థలాలు కేటాయించాలని సూచించారు. మండల అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని.. జిల్లా అధికారులు స్పందించి తమకు సొంత గ్రామంలోనే స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు.