Pedavadlapudi lift Irrigation Construction Works: కృష్ణా డెల్టా పరిధిలోని 26వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల ప్రాజెక్టు అది. గత ప్రభుత్వ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి. కేవలం 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న పాలకులు.. ఆఖరిదశలో ఉన్న ఇంత చిన్న ప్రాజెక్టుకు నిధులు కేటాయించటం లేదు. ఫలితంగా సాగునీటి కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి బకింగ్‌హామ్ కాలువ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ నుంచే పెదవడ్లపూడి వద్ద హైలెవల్ చానల్ మొదలవుతుంది. బకింగ్‌హామ్ కాలువతో పోల్చితే హై లెవెల్ కెనాల్ ఒకటిన్నర మీటరు ఎత్తులో ఉండటం వల్ల ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులోకి నీరు వస్తోంది. కాలువలో నీటి ప్రవాహం 2500ల క్యూసెక్కుల కంటే తగ్గితే హైలెవల్ చానల్‌కు చుక్క నీరు కూడా అందదు. ఈ సమస్య పరిష్కారానికి హైలెవల్ ఛానల్‌లోకి నీటిని ఎత్తిపోయడమే పరిష్కారం.
నీటిని ఎత్తిపోయటానికి 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు జిల్లా పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించింది. 9కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు 70శాతం పూర్తయ్యాయి. పథకానికి అవసరమైన మోటార్లు, పంపులు వచ్చాయి. సివిల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మోటార్లు అమర్చి పైపులు ఏర్పాటుచేసే పనులు మిగిలాయి. ఈ లోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. తర్వాత బిల్లులు మంజూరు చేయకపోవడంతో గుత్తేదారు నాలుగేళ్లుగా పనులు ఆపేశారు.
మోటార్లు, పంపులు, పైపులు అమర్చకుండా పడేయడంతో నిరుపయోగంగా మారి తుప్పుపడుతున్నాయి. ఇప్పటికే 5 కోట్ల 30 లక్షల రూపాయలు గుత్తేదారుకు చెల్లించారు. మరో కోటి పని పూర్తిచేసి బిల్లు పెడితే సీఎఫ్ఎంఎస్ లో ఆగిపోవడంతో.. పనులు ఆపేశారు. మరో 3కోట్లు నిధులు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయి. పథకం అందుబాటులోకి వస్తే ఆయకట్టు రైతుల అవస్థలు తీరుతాయి. ఎత్తిపోతల పూర్తై కాలువకు ఎంతోకొంత నీరు వదిలితే కనీసం డీజిల్ ఇంజన్లు పెట్టుకునైనా పంటలు కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు.