ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శూన్యం నుంచి సుస్థిర అభివృద్ధి దిశగా పెదరావూరు - guntur district Pedaravoor village news update

రాజకీయాల్లేని ఊళ్లుండవు..! పార్టీలు, పంతాలు లేని పల్లెలుండవు.! కానీ... ఆ ఊర్లో ఎన్నికల వరకే రాజకీయం..! ఆ తర్వాత అంతా అభివృద్ధి మంత్రమే.! ఊరి బాగు కోసం.. అంతా కలిసి నడుస్తారు. అందుకే గతుకుల రోడ్డు కాస్తా సాఫీగా మారింది. కనీస వసతుల్లేని.. స్థితి నుంచి మెరుగైన మౌలికవసతులు వచ్చేశాయి. అభివృద్ధికి, రాజకీయానికి స్పష్టమైన విభజనరేఖ గీసుకొని ప్రగతి పథంలో దూసుకెళ్తున్న ఓ పల్లె ప్రగతి ప్రస్థానం ఇది.

Pedaravooru village development
సుస్థిర అభివృద్ధి దిశగా పెదరావూరు గ్రామం

By

Published : Feb 3, 2021, 4:26 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామం గురించి మాట్లాడితే 2001కి ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ గ్రామం.. శూన్యం నుంచి సుస్థిర అభివృద్ధి సాధించింది. 2001కి ముందు అక్కడ సరైన రోడ్లు లేవు. అలయాలు అవసానదశలో.. ఉండేవి. ఇక శ్మశానం గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు.

శూన్యం నుంచి సుస్థిర అభివృద్ధి దిశగా...

ఈ పరిస్థితులే ఆ గ్రామస్థుల్ని ఏకతాటిపైకితెచ్చాయి. ఊరి ముఖచిత్రాన్నే మార్చేయాలని నిర్ణయించుకున్నారు గ్రామస్థులు. ఐతే.. సొమ్ములెలా అనే ప్రశ్న వారికి ఎదురైంది. దానికి సమాధానం పెదరావూరులో పుట్టి పెరిగి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్న వారి దగ్గర దొరికింది. కొడాలి రమణకుమార్ అనే వ్యాపారి గ్రామాభివృద్ధిలో సింహభాగం భరిస్తానని ముందుకొచ్చారు. ఇంకొందరు వ్యాపారులు, గ్రామస్థులు తలోచేయి వేసి.. సంకల్ప బలాన్నిచాటారు. దానికి ప్రతిఫలమే ఇప్పుడీ గ్రామంలో అమరిన మౌలిక వసతులు.

అభివృద్ధి బాటలో సాగి..

గ్రామాభివృద్ధిలో భాగంగా శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. పురాతన శైలి దెబ్బతినకుండా రామాలయాన్నీ అధునీకరించారు. స్వామివారి కళ్యాణ మండపం నిర్మించారు. గ్రామ రెవెన్యూ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, బస్ షెల్టర్, వ్యవసాయ సహకార సంఘం భవనం వంటివి నిర్మించుకున్నారు. ఇందులో కోటి రూపాయలకు పైగా.. రమణకుమార్ సమకూర్చారు. శ్మశానం అభివృద్ధికి వెనిగళ్ల సురేష్ 30 లక్షలు వెచ్చించారు. ఓ పార్కు మాదిరిగా దాన్ని తీర్చిదిద్దారు. మరణానంతర కార్యక్రమాల నిర్వహణకు కర్మశాల కూడా.. నిర్మించారు. పొలాలకు వెళ్లే రోడ్డును అభివృద్ధి చేసుకున్నారు.

సుస్థిర అభివృద్ధి దిశగా పెదరావూరు గ్రామం

కలిసికట్టుగా ఉంటేనే మార్పు..

గ్రామస్థులంతా కలిసికట్టుగా ఉంటేనే మార్పు కనిపిస్తోందని దాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్ని కేవలం ఎన్నికల వరకే పరిమితం చేశారు. అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే మాట.. ఒకటే బాట..! అందుకే పెదరావూరు అభివృద్ధి పథంలో పయనిస్తోంది.

ఇవీ చూడండి...:చేబ్రోలులో పోలింగ్ కేంద్రం... 'పరదా' కప్పిన యంత్రాంగం!

ABOUT THE AUTHOR

...view details