Revanth Reddy comments on MLAs acquisition Case: తెరాస, భాజపాలు సమన్వయంతో పని చేసుకుంటూ మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదనే విషయాన్ని చాటుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలూ వ్యూహాత్మకంగానే వివాదం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఆటలో నుంచి తప్పించే విధంగా తెరాస, భాజపా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక, భారత్ జోడో యాత్ర దృష్టిని మరల్చేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
రోహిత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్‌లను ఎందుకు సీజ్ చేయలేదన్నారు. ఏసీబీ పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యే ముఠాకు నాయకుడైన కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని.. అలా అయితే కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ-2గా చేర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను తీసుకువెళ్లిన పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందన్నారు. విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గుండుతో గుట్ట ఎక్కి ప్రమాణం చేసినా ప్రజలు నమ్మరని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.