Pawan Kalyan third leg of Vijayatra begins in Visakhapatnam: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి విజయ యాత్ర'పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక విషయాలపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్ర విశాఖపట్నం నగరంలో జరగనుందని వెల్లడించారు. ఈ మూడో విడత వారాహి విజయ యాత్ర గత రెండు విడతల్లో నిర్వహించిన యాత్రను మించి ఉంటుందని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్ర ఫిక్స్.. ఎక్కడినుంచంటే..? జనసేన మూడో విడత విజయ యాత్ర విశాఖలో.. సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..''పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్రపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించాం. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రను ఇటీవలే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించారు. త్వరలోనే మూడో విడత యాత్ర విశాఖపట్నం నగరంలో మొదలవుతుంది. గత రెండు విడతల్లో నిర్వహించిన యాత్రను మించి ఈ మూడో (విశాఖ నగరంలో) యాత్ర ఉండబోతోంది. పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి, వారాహి విజయ యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను. అలాగే, ఈ మూడో యాత్రలో జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. దాంతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన, వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు ఉంటాయి. సమస్యలపై వినతులను స్వీకరించే కార్యక్రమాలు కూడా ఉంటాయి.'' అని ఆయన అన్నారు.
జూన్ 14న పవన్ తొలిదశ వారాహి విజయ యాత్ర..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూన్ 14వ తేదీన మొదటి వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. యాత్రకు ముందు పవన్ అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, తొలి యాత్రను మొదలుపెట్టారు. మొదటి విడతలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ప్రతి నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు యాత్రను సాగించారు. యాత్రలో భాగంగా ఆయన వివిధ వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశమై, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని.. అధికార పార్టీపై, సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.
జులై 9న రెండో దశ వారాహి విజయ యాత్ర..తూర్పు గోదావరి జిల్లాలో మొదటి విడత యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్..జులై 9వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండవ విడత యాత్రను ప్రారంభించారు. రెండవ విడతలో ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ మూడో విడత విజయ యాత్ర విశాఖపట్నంలో ఉండబోతుందని వెల్లడించారు. దీంతో జనసైనికులు ఆనందంతో ఉరకలు వేస్తున్నారు. విశాఖలో జరిగే పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు.
వాలంటీర్ వ్యవస్థపై చేసిన విమర్శలు రుజువయ్యాయి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం మూడో విడత వారాహి యాత్రపై పలు కమిటీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..''మహిళల అక్రమ రవాణాపై మాట్లాడితే పోలీసులు నన్ను ప్రశ్నించారు. ఇదే విషయంపై కేంద్రం పార్లమెంటులో గణాంకాలతో సహా చెప్పింది. వాలంటీర్ వ్యవస్థపై నేను చేసిన విమర్శలు పెందుర్తిలో రుజువయ్యాయి. వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం నన్ను బాగా కదిలించింది. వారాహి యాత్రలో ఆ వృద్ధురాలి కుటుంబాన్ని కలుస్తా. పంచాయతీరాజ్ వ్యవస్థను చంపేందుకే వాలంటీర్ వ్యవస్థను సృష్టించారు. పిల్లల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానంలో ఉండటం ఆందోళన కల్గించే అంశం. మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు విశాఖలో భూకబ్జాలు ఆగాలి. ఉత్తరాంధ్రలో వనరుల దోపిడీ దేశం మొత్తం తెలిసేలా ఈ మూడో వారాహి యాత్ర జరుగుతుంది. మంత్రులు కబ్జా చేసిన భూములు, రుషికొండను పరిశీలిస్తా. స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు రోడ్లపైకి వస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దిల్లీకి వెళ్లిన ప్రతీసారి స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నాను.'' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.