PAWAN KALYAN COUNTER TO PERNI NANI : జనసేన ఎన్నికల ప్రచార వాహనమైన వారాహి రంగులపై వైసీపీ నేతల చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశారు. వారాహి రంగుతో ఆలీవ్ గ్రీన్‌కలర్‌లో ఉన్న మిగతా వాహనాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా అని ప్రశ్నించారు. అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయని మండిపడ్డారు.
ముందు తన సినిమాలను అడ్డుకున్నారన్న పవన్.. ఆపై విశాఖ వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. విశాఖ నగరం నుంచి బలవంతంగా పంపించేశారన్నారు. మంగళగిరిలో కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారని.. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నా ఆపేశారంటూ ఆక్షేపించారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారన్న పవన్.. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు.