రైతు భరోసాను కేంద్ర పథకమైన కిసాన్ యోజనతో ముడిపెట్టి... అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని భావిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12వేల 500 అందిస్తామని నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలోనూ ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ యోజన పథకంలోని రూ.6వేలతో కలిపి రూ. 13వేల 500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నవరత్నాల ప్రకటన విడుదల చేసినప్పుడు... కేంద్ర ప్రభుత్వ సాయంతో రైతుభరోసా పథకాన్ని రూపొందిస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు . రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12వేల 500, కేంద్రం సాయం రూ.6వేలు కలిపి మొత్తం రూ.18వేల 500 ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు. ఒకవేళ అంత మొత్తాన్ని ఇవ్వలేకపోతే అందుకు కారణాలను రైతులకు చెప్పాలని... వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలన్నారు.