Pawan Kalyan on Party Alliances: జనసేన-బీజేపీ పొత్తుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారంపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని.. నేరుగా ప్రజలకే చెబుతామని ఆయన స్పష్టతనిచ్చారు. ఎక్కడ పోటీ చేయాలనేది తమ స్వీయ నిర్ణయమని పేర్కొన్నారు. మాపై ఆరోపణలు చేయడం ప్రక్కన పెట్టి.. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు సక్రమంగా జీతాలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
Pawan Kalyan Comments: గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ''తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. పసుపు బోర్డు కల కేంద్రం సాకారం చేసింది. సీఎం దిల్లీ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదు. పొత్తులు, సీట్లపై కంటే దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి బోర్డులపై దృష్టి పెట్టాలి. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి దిళ్లీ వెళ్తున్నారు. ఏపీ విభజన తీరు బాధాకరమని ప్రధాని పార్లమెంటులో చెప్పారు. ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్డీఏ భేటీకీ హాజరయ్యాం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి వెళ్లాలని నా ఆకాంక్ష. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా ఆకాంక్ష. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపడం చాలా బాధాకరం. నేను పార్టీ సమావేశాలకు వస్తుంటే అడ్డంకులు సృష్టించారు. ప్రత్యేక పరిస్థితుల్లో నేను టీడీపీతో పొత్తు ప్రకటన చేశా. వాస్తవంగా పొత్తు ప్రకటన దిల్లీలో చేసి ఉండాల్సింది'' అని ఆయన అన్నారు.
Pawan Kalyan on Chandrababu: అనంతరం చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చాక తాను ఇంటికి వెళ్లి కలుస్తానని అన్నారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ ఉండాలని ఇరుపక్షాల నిర్ణయమన్న పవన్.. నాదెండ్ల మనోహర్ ఛైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. అందులో సభ్యులుగా మహేందర్‌రెడ్డి, కందుల దుర్గేష్, గోవింద్, యశస్విని, బొమ్మిడి నాయకర్‌లను నియమించినట్లు ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ పోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తుందని ప్రజల్లో ఉందని పవన్ వివరించారు.