- తెలంగాణ పోరాటాల గడ్డ అని.. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను ఒక ఆశయం కోసం పోరాడుతున్నానని.. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో లేనని తెలిపారు. తెలంగాణ ప్రజల నుంచే తాను నేర్చుకునే స్థాయిలో ఉన్నానని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రజారాజ్యం నాటి జ్ఞాపకాలను పవన్ కల్యాణ్ నెమరవేసుకున్నారు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసని.. అప్పటి కాంగ్రెస్ నేతల తీరు వల్లే తాను పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. ఈ క్రమంలోనే సుఖమయ జీవనం నుంచి గొడవల వైపు ఎందుకు వస్తున్నారని తనను చాలామంది అడిగారన్న పవన్.. సమాజం నుంచి తీసుకున్న వాళ్లం మళ్లీ సమాజం కోసం ఏదైనా చేయాలని భావిస్తానని చెప్పారు.
తెలంగాణలో పోటీ ఖాయం..: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీపైనా పవన్ స్పందించారు. రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో పోటీ చేస్తామన్న ఆయన.. 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉండదని.. కానీ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని.. సొంతంగా గెలిచే స్థాయి లేనప్పుడు పోటీ చేయొద్దని భావిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పాలన బాగుందని కితాబిచ్చిన పవన్.. తెలంగాణ, ఏపీ సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చలేమని అన్నారు.