ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం డబ్బులింకా చెల్లించరేం? పవన్ కల్యాణ్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ మండిపడ్డారు. ధాన్యాన్ని విక్రయించిన ప్రభుత్వం 48 గంటల్లో చెల్లిస్తానన్న సర్కారు ఎందుకింకా డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించారు.

pawan kalyan fires on ysrcp
ప్రభుత్వంపై మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Feb 18, 2020, 11:17 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో... ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. రైతులు పంట అమ్ముకొని వారాలు గడుస్తున్నా... ఇప్పటికీ సొమ్ము రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు జనసేనాని ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2,016 కోట్లు చెల్లించాల్సి ఉందని.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయ్​..?

లక్ష మందికి పైగా రైతులు... తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని పవన్​ తెలిపారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని ఆయన నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరిచిపోయిందని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా సొమ్ము చేతికి రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఖరీఫ్‌ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో సర్కారు సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేశారు'

ABOUT THE AUTHOR

...view details