Pawan Kalyan demand help for Farmers: తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోతకు వచ్చిన పంటలు, కళ్లాల్లో ఉంచిన ధాన్యం కళ్లెదుట వర్షాలకు నానిపోతుంటే రైతులు దైన్యంగా చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రైతులను చూస్తుంటే తన గుండె భారంగా మారుతోందన్నారు.
ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి, పత్తి లాంటి వాణిజ్య పంటతో బొప్పాయి, అరటి వంటి ఉద్యాన పంటలు సైతం తుపాను ధాటికి దెబ్బతిన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పటం లేదని ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ,.. ఎలా తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు.. ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండాలని ఎందుకు చెప్పటం లేదన్నారు. తుపాను దెబ్బతో నష్టపోయిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలన్నారు.