ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న డొక్కా సీతమ్మ వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. డొక్కా సీతమ్మ సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. అడిగినవారికి లేదనకుండా ఆస్తులు కరిగిపోయినా సీతమ్మ అన్నదానం చేశారని....పేదలకు పెళ్లిళ్లు, చదువుకోడానికి ఆర్థిక సహాయం వంటి అనేక మానవీయ కార్యక్రమాలను చేసేవారన్నారు. సీతమ్మ అన్నదాన కీర్తిని బ్రిటిష్ పాలకులు సైతం కొనియాడారని గుర్తుచేశారు.
జనసేన ఎన్నికల ప్రణాళికలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు… డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. ఆ కారణజన్మురాలు తెలుగు బిడ్డగా పుట్టడం మనం చేసిన పుణ్యఫలంగా పవన్ అభివర్ణించారు. డొక్కా సీతమ్మ అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడం మన బాధ్యత అని పేర్కొన్నారు. జనసేన పార్టీ భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆహార శిబిరాలను డొక్కా సీతమ్మ పేరిటే నిర్వహించిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. ఇప్పుడు కరోనా సమయంలో జనసేన శ్రేణులు ఆ అపర అన్నపూర్ణ పేరిట పేదలకు ఆహారం అందజేస్తున్నారని పవన్ ట్వీట్ చేశారు.