గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన బృందాలు క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి వాస్తవ పరిస్థితిని తనకు తెలియజేశాయన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగి వేల మంది నిరాశ్రయులవ్వడం బాధాకరమన్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవని... అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరన్నారు. పసిపిల్లలు పాలు లేక ఇబ్బందులు పడుతున్నారని... పాల కోసం అధికారులను అడిగితే.. అత్యవసర వస్తువుల జాబితాలోకి పాలు రావని నిర్లక్ష్యంగా సమాధానమివ్వటం దురదృష్టకరమన్నారు. ఈ కష్ట సమయంలో అత్యవసర వస్తువుల జాబితాలో పాలను చేర్చి పసిపిల్లల ఆకలి తీర్చాలని కోరారు.