Jana Sena chief Pawan Kalyan: వైకాపా ప్రభుత్వ అవినీతి, అక్రమాల్ని చూసే.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని పార్టీ ఆవిర్భావ సభలో అన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఎవరి పల్లకీ మోయటానికి సిద్ధంగా లేమని... ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన 5కోట్ల విరాళం ప్రకటించారు. భాజపాతో పొత్తు ఉన్నంత మాత్రాన ప్రతి నిర్ణయాన్ని సమర్థించేది లేదన్న పవన్ .. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆపాలని, పెట్రో ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్యవసాయ స్థితిగతులు, కౌలురైతుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలు, అమరావతి అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత 6 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. జనసేన భవిష్యత్ చర్చించేందుకు సమావేశం పెట్టామన్న పవన్.. మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ అనంతరం వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారు. ఓట్లు చీలకుండా చూస్తామంటే వైకాపా నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.
అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆవేదన కలిగించిందన్న పవన్.. అందుకే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించామన్నారు. ఈనెల 12న అనంతపురం జిల్లా నుంచి జనసేన రైతు భరోసా యాత్ర ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు జగన్ అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బాదుడే బాదుడు అంటే ప్రజలపై ఎంతో వేదన ఉందని భావించానని.. కానీ అధికారంలోకి వచ్చాక పన్నులు, ధరలు బాదుడంటే ఎంటో చూపారని ఎద్దేవా చేశారు.