Pawan Kalyan on Chandrababu: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు? ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్ధం తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని పవన్ వెల్లడించారు. మెుదట సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తరువాత.. ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై నేతల ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని పవన్ వెల్లడించారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్ విమర్శించారు.