Patient Attenders Problems In Guntur GG Hospital: గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి ఒక్కరోజులోనే సుమారుగా 3 వేల మంది రోగులు.. వారికి సహాయకులుగా బంధువులు వస్తుంటారు. నిత్యం రోగులు, సహాయకులతో ప్రభుత్వాస్పత్రి కిటకిటలాడుతుంటుంది. ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్న రోగులకు మంచాల సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు బాలింతలు ఒకే మంచంపై సేద తీరాల్సిన దుస్థితి ఆస్పత్రిలో నేటికీ కొనసాగుతోంది. ఇదంతా లోపల రోగులు అనుభవించే యాతన. వివిధ విభాగాల్లోని ఇన్ పేషెంట్లకు తోడుగా ఉండేందుకు సహాయకులు, బంధువులు ఆస్పత్రికి వస్తుంటారు. వీరంతా ఆరుబయట, చెట్ల కింద, వరండాలో ఇలా ఖాళీ ప్రదేశం ఎక్కడ దొరికితే అక్కడ సేదతీరుతున్నారు.
జీజీహెచ్‌లో సహాయకుల ఇక్కట్లు ఎండైనా, వానైనా వారు అనుభవించే పాట్లు దేవుడికే ఎరుక. సిమెంట్ చప్టాలపైన, నేలపైన చాపలు వేసుకుని నిద్రించాల్సిన దుస్థితి వారిది. ప్రధానంగా అత్యవసర విభాగం, లేబర్ వార్డు రోగులకు కావాల్సినవి సమకూరుస్తూనే.. తమ మకాం ఎక్కడుందో చూసుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. ఆస్పత్రి లోపల, బయట ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు.. రోగుల బంధవుల దాహర్తిని కొంత వరకు తీరుస్తున్నాయి.
"మేము మా కోడలు ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చాము. ఆస్పత్రి లోపలికి వెళ్తే లోపల ఉండనివ్వటం లేదు. బయటకు నెట్టేస్తున్నారు. బయట ఎండగా ఉంది. బయట ఉండటానికి ఎలాంటి వసతి లేదు. దీంతో బయట పట్టాలు కట్టుకుని సేదతీరుతున్నాము. ఎదైనా ఏర్పాటు చేస్తే రోగులతో వచ్చే సహాయకులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది." -పేతురు, రోగి సహాయకుడు