graduate MLC election in AP: పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. నంద్యాల జిల్లా బేతంచర్లలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించిన ఆయన... వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజం తగ్గిందన్నారు. అందరూ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తిరుపతిలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారంటూ... తెలుగుదేశం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యాన... వెస్ట్ పోలీస్ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పోలీసులకు అందించారు. సీఎం జగన్ ఉద్యోగులు, టీచర్లు, యువతను సైతం మోసం చేసిన దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేవలం ఒక్క తిరుపతిలోనే సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా... ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రచారం చేశారు. విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు తరపున ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు.... వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.