గుంటూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తొలివిడత తెనాలి డివిజన్‌లో ఎన్నికలు ముగియడంతో అక్కడ గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే నరసరావుపేట డివిజన్‌లో గురువారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు రాత్రి పగలు తేడా లేకుండా ఓటర్లను కలుసుకుని గుర్తులు చెప్పి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మూడో విడత గురజాల డివిజన్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తయి అప్పీళ్ల పరిష్కారం కొనసాగుతోంది. నాలుగో విడత గుంటూరు డివిజన్‌లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార యంత్రాంగం దశలవారీగా నిర్వహిస్తున్న ఎన్నికలకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, సామగ్రి తరలింపు, విధుల కేటాయింపు తదితర అంశాలలో నిమగ్నమైంది. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం పంచాయతీ ఎన్నికల్లో నిమగ్నమైంది. ఊరూవాడా సందడిగా మారింది.
తీర ప్రాంతంలో ఫలితాలపై విశ్లేషణ
తెనాలి డివిజన్‌లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు తేలడంతో రాజకీయ పార్టీలు వారి మద్దతుదారులకు వచ్చిన ఓట్ల లెక్కలు తీసుకుని విశ్లేషణలు చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో వచ్చిన ఓట్లు, ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తున్నారు. రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినప్పటికీ గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీల మద్దతుతోనే బరిలోకి దిగారు. దీంతో ఎన్నికల ఫలితాలపై గ్రామస్థాయి నుంచి విశ్లేషణ మొదలైంది. ఎన్నికలు జరిగిన తీరు.. పోలింగ్ సరళి.. ఓటింగ్ శాతం తదితర అంశాలు పరిశీలించి ఒక అంచనాకు వస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. పరాజయం పొందిన అభ్యర్థులు లెక్కలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
నరసరావుపేటలో ప్రచార హోరు
రెండో విడతలో ఎన్నికలు జరిగే నరసరావుపేట డివిజన్ పరిధిలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని మండలాలతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారంతో ప్రచారం ముగిసింది. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో అభ్యర్థులను ఓటర్లను కలుసుకుని విజయానికి బాటలు వేసుకుంటున్నారు.