పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి సీమ. నాటి రణ క్షేత్రమైన కార్యమపూడి, ప్రస్తుతం కారంపూడి. అక్కడ జరిగిన యుద్ధంలో అసువులు బాసిన వీరులను స్మరించుకుంటూ జరిపే ఉత్సవాలే పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కారంపూడిలో ఇవి 5రోజుల పాటు జరుగుతాయి. కార్తిక పౌర్ణమి రోజు పోతురాజుకు పాడిగాం కట్టి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం కార్తిక అమావాస్య రోజున ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రతి ఏటా రచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు అనే పేర్లతో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
దాయాదుల మధ్య వైరం..
అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామరాజు గురజాల రాజ్యాన్ని.. రెండవ భార్య సంతానమైన మలిదేవులకు మాచర్ల రాజ్యాన్ని పాలించారు. మాచర్ల రాజ్యానికి మంత్రిగా బ్రహ్మనాయుడు.. గురజాల రాజ్యానికి నాగమ్మ మంత్రిగా పనిచేశారు. నాగమ్మ పన్నిన కుట్రలు, కుతంత్రాలు బ్రహ్మనాయుడుని వనవాసం చేయించాయని చరిత్ర చెబుతోంది. వైష్ణవం ద్వారా ప్రజలలో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు. శైవమతాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాడులో ముఖ్య స్థానం సంపాదించింది. కోడిపోరుతో మలిదేవులకు, నలగామునికి మధ్య వైరం ప్రారంభమయ్యింది. వారి మధ్య సంధి కుదిర్చేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురవ్వటంతో గురజాల, మాచర్ల రాజ్యాల మధ్య వైరం మరింత పెరిగి 1182లో పల్నాటి యుద్ధానికి దారితీసింది.
మంత్రుల మధ్య పోరు
రాజుల మధ్య దాయాదుల పోరు.. మంత్రుల మధ్య వైష్ణ, శైవ మతాల పోరు.. పల్నాటి యుద్దానికి అంకురార్పణగా చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా మాచర్ల రాజ్యాన్ని బ్రహ్మనాయుడు కాపాడుతుంటే.. కుట్రలు కుతంత్రాలతో మాచర్ల రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు గురజాల రాజ్యాం ప్రయత్నిచింది. కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు సమసమాజ స్థాపనకు చాపకూడును ఏర్పాటు చేయటమే కాకుండా.. దళితుడైన కన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించి ఒక వీరుడిగా తయారుచేసిన ఘనత దక్కించుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని నాగమ్మ గురజాల, మాచర్ల రాజ్యాల మధ్య రాగద్వేషాలను పెంపొందించేది. అదే యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది.