సేంద్రీయ వ్యవసాయానికి, దేశవాళీ విత్తనానికి ప్రచారం కల్పించేందుకు గుంటూరు జిల్లాకు చెందిన యువరైతు వినూత్న ప్రయోగం చేశారు. తన పొలంలో గోవింద నామాల ఆకృతిలో వరినారు పోశారు. కొల్లిపొర మండలం అత్తోటకు చెందిన యువరైతు బాపారావు కొన్నేళ్లుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. తనతో పాటు కలిసి వచ్చిన రైతులను కూడా ఇదే తరహా విధానానికి మళ్లించారు. హైబ్రిడ్ విత్తనాల కన్నా దేశవాళీ విత్తనాలు మన ఆరోగ్యానికి, నేలకు మంచిదనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ 100కు పైగా దేశీయ వరి రకాల్ని సాగుచేశారు.
వివిధ రకాల జబ్బులు ఎదుర్కొనేందుకు ఆ విత్తనాలు ఉపయోగపడతాయని బాపారావు అంటున్నారు. మరింత ఎక్కువ మందికి దేశవాళీవిత్తనాలు, సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు చేరవేసేందుకు వరి వంగడాల్ని గోవింద నామాల రూపంలో తన పొలంలో చల్లారు. అవి మొలకెత్తటంతో గోవింద నామాలు రూపంలో వరినారు కనిపిస్తోంది.