గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నేలకు ఒరిగాయి. వరిచేల్లో చేరిన వరద నీటిలో ధాన్యం తడిసి..రంగు మారుతోంది. జిల్లాలోని చెరుకుపల్లి, నిజాంపట్నం, రేపల్లె, నగరం మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతుల అంచనా.
రేపల్లెలో నీట మునిగిన పంట.. ఆందోళనలో కౌలు రైతులు
నివర్ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయమవుతున్నాయి. పంట పొలాలు మునిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో నీట మునిగిన వరి ధాన్యం రంగు మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీట మునిగిన వరి పంట
అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట పూర్తిగా పాడయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. గ్రామ, మండల అధికారులెవరూ తమను పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...