OUT SOURCING EMPLOYEES PROBLEMS : ముఖ్యమంత్రి హోదాలో ఆప్కాస్ ను ప్రారంభిస్తూ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని ఆప్కాస్‌లో చేర్చి మెరుగైన వేతానాలు ఇస్తామని ఘనంగా ప్రకటించారు. అన్ని డిపార్టుమెంట్లలో కాంట్రాక్టర్ కింద పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆప్కాస్‌లో చేర్చుతామన్న సీఎం.. ఆహామీ పూర్తిగా నెరవేర్చలేదు. ఇంకా లక్షమంది పైగా ఔట్సోర్సింగ్ సిబ్బంది.. కాంట్రాక్టర్ల కింద ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. వారందరినీ ఆప్కాస్‌లో చేర్చాలని ఎన్నో సార్లు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల కింద గొడ్డు చాకిరీ చేస్తూ వారి ఇచ్చినంత తీసుకుని దుర్భరంగా జీవితాలను గడుపుతున్నారు.
విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు , పలు వార్డుల్లో నిర్వహణ, సెక్యూరిటీ గార్డులుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా సిబ్బందిని నియమించారు. ఎన్నో ఏళ్ల క్రితం నియమితులైన వీరికి ఇచ్చే జీతం పదకొండువేల లోపే. చాలా మందికి కాంట్రాక్టర్ ఇచ్చే జీతం 8 వేలే. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. మూడు నెలలకో ఆరు నెలలకో ఓ సారి ఇస్తారు. కుటుంబపోషణ భారంగా మారిందని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు.