ORGANIC FOOD IN MARRIAGE: పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరపురానిది. మరి అటువంటి దానిని చాలా మంది గ్రాండ్గా చేసుకుంటారు. వచ్చిన అతిథులను మర్యాదలతో ముంచెత్తుతారు. రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చిన వారిని మెప్పించాలన్న తాపత్రయంలో చాలా రకాల వంటలు చేయిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కల్తీనే. తినే వాటి నుంచి తాగే వాటి వరకూ ప్రతి దాంట్లో ఎంతో కొంత కల్తీ జరుగుతూనే ఉంది. ఇక పెళ్లిల్లో అంటే అది చాలా మొత్తంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఓ వ్యక్తి అది దృష్టిలో పెట్టుకుని ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
పెళ్లిలో కేవలం భోజనం మీద మాత్రమే కాకుండా వచ్చే అతిథుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాడు. అందుకే వినూత్నంగా కూతురు పెళ్లిలో సేంద్రీయ కూరగాయలతో విందు వడ్డించి కలకాలం గుర్తుండిపోయేలా చేశాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణమండపంలో రాజ నర్సింహా- ఉమామహేశ్వరిల కూతురి వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చే చుట్టాలకు ప్రకృతి సేద్యం ద్వారా పండిన పంటలను మాత్రమే ఆహారంగా వడ్డించాలని నిర్ణయించాకు.
అనుకున్నదే తడవుగా ఎటువంటి కెమికల్స్, పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వస్తువులతో పండించిన దేశవాళీ బియ్యం రకాలు, పప్పులు, కాయగూరలు, వంటకు వినియోగించే దినుసులు.. ఇలా అన్ని రకాలు తెప్పించారు. ఆఖరికి నూనెల దగ్గర నుంచి మంచి నీళ్ల వరకు ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి దొరికిందే. వంటలకు వాడిన ముడి సరుకుల్లో తొంభై శాతం పాలమూరు రైతుల నుంచి తెప్పించడం ఇక్కడ విశేషం.