TDP Ready for MLC Eections with Left Parties: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఉన్న ఏ అవకాశం జారవిడుచుకోకూడదని తెలుగుదేశం, వామపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థులకు, రెండో ప్రాధాన్యత పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తమ రెండో ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం అభ్యర్థులకు వేసేందుకు వామపక్షాలు పరస్పర అవగాహనకు వచ్చాయి.
ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం, కడప-అనంతపురం - కర్నూలు పట్టభద్రుల నియోకజవర్గం, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ పట్టభద్రుల నియోకజవర్గంలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తూర్పు రాయలసీమ పరిధిలోని 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. నిరుద్యోగ, ఉద్యోగ వ్యతిరేక వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని టీడీపీ వామపక్షాలు పిలుపునిచ్చాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను దింపాలని తెలుగుదేశం నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి జరిగే ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని దింపనుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 22- 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉండగా.. రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి.
టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌లు వైఎస్సార్సీపీలో చేరినా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అటు అధికార పార్టీని ఎమ్మెల్యేల అసమ్మతి సెగ వేధిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.