Opposition Leaders Objected Vijayasai Reddy Comments: రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ‘ఇండియాస్ గ్లోరియస్ స్పేస్ జర్నీ మార్క్‌డ్ బై సక్సెస్‌ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3’ (Chandrayaan-3) అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయిరెడ్డి.. చంద్రబాబు గురించి మాట్లాడారు. ‘‘దేశంలో తాము ఎన్నో చేసినట్లు కాంగ్రెస్, బీజేపీ చెప్పుకొంటుండగా మధ్యలో మా రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వచ్చి సైన్స్‌కి తానెంతో చేసినట్లు ప్రకటించుకుంటున్నారు. ఎన్నోసార్లు ఆయన తానే కంప్యూటర్‌ను తయారుచేసినట్లు, అంతరిక్ష పరిశోధనకు సైతం తానే ఆద్యుడినని, సెల్‌ఫోన్‌ను తానే కనిపెట్టినట్లు ప్రకటించుకున్నారు’’ అని పేర్కొన్నారు.
Vijayasai Reddy Comments in Rajya Sabha: దాంతో ఆ సమయంలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీఆర్‌ఎస్ సభాపక్ష నాయకుడు కె.కేశవరావు అడ్డుపడగా మీ మాట నేను వినదలచుకోలేదు, దయచేసి కూర్చోమని విజయసాయిరెడ్డి గద్దించారు. డీఎంకే సభాపక్ష నేత తిరుచ్చి శివ లేచి అభ్యంతరం వ్యక్తం చేయగా తన ప్రసంగానికి అడ్డుపడే హక్కు మీకు లేదంటూ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తం చేసి, తన ప్రసంగాన్ని విజయసాయి రెడ్డి కొనసాగించారు. చంద్రబాబు నిజంగా అన్నీ కనిపెట్టారా అన్న విషయాన్ని మీరు విచారించి కనిపెట్టాలని అన్నారు.
సెల్‌ఫోన్, ఐటీ, కంప్యూటర్‌ను ఆయన కనిపెట్టింది నిజమైతే భారత్ దానిపై పేటెంట్ హక్కులు కోరొచ్చని పేర్కొన్నారు. ఆ పేటెంట్ హక్కుల కింద బిలియన్ల రూపాయలు పొందవచ్చని వ్యంగ్యంగా అన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు విజయసాయిరెడ్డి ప్రసంగానికి అడ్డుతగులుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ (Point of Order) లేవనెత్తగా మొత్తం ప్రతిపక్షం అరాచకంగా వ్యవహరిస్తోందని వారిపై కూడా ఆరోపణలు చేశారు.