పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి.. వ్యాపారులను హెచ్చరించారు. మూడు రోజులుగా అర్బన్ పరిధిలో అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆటో గ్యారేజీల వద్ద తనిఖీలు నిర్వహించారు.
తొలిరోజు 65 మందిని బాలలను, రెండో రోజు 26 మందిని, మూడో రోజు 16 మంది బాలలను గుర్తించారు. మెుత్తం 107 మందికి పోలీసు కార్యాలయంలో కొవిడ్ పరీక్షలు చేయించారు. బాలలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వారితో ఎస్పీ మాట్లాడారు. బడికి వెళ్లి బాగా చదువుకోవాలన్నారు. పిల్లలను పనికి పంపిస్తే చర్యలు తీసుకుంటామని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలల సంరక్షణాధికారుల సమక్షంలో ఆయా పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.