కష్టపడి ఒక పని చేస్తే ఎంతటి పని అయినా విజయవంతంగా పూర్తి చేయవచ్చని నిరూపించారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు. జిల్లా గ్రామీణ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు 'ఆపరేషన్ ముస్కాన్' కార్యక్రమంలో భాగంగా పని చేసే 32 బాలబాలికలను గుర్తించి పాఠశాలలో చేర్పించారు.
చిలకలూరిపేట మండలంలోని పెద్ద పంచాయితీలైన గొట్టిపాడు, బొప్పూడి గ్రామాలలో సర్వే నిర్వహించారు. పిల్లలను గుర్తించి వారికి పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులను, సంరక్షకులకు... పిల్లలను చదవిస్తే కలిగే ఉపయోగాలు వివరించారు. ప్రభుత్వం పిల్లల అభివృద్ధికి తోడ్పాటునిస్తుందని తెలిపారు. చదువు ఉపయోగాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లి ఖాతాలో ప్రభుత్వం పదిహేను వేలు జమ చేస్తుందని తెలియచేశారు. అనంతరం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ వారి సహకారంతో 32 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.