ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. ఆన్​లైన్​లోనే పూజలు, హోమాలు - ఆన్ లైన్ ద్వారా పూజలు తాజా వార్తలు

కరోనా.. మనిషి జీవన విధానాన్ని మార్చేసింది. అలాగే ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది. ఎంతో మంది ఉపాధికి గండికొట్టింది. పూజలు, వ్రతాలు, హోమాలు అన్నింటినీ ఆపేసింది. అయితే.. తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు మాత్రం యథావిథిగా జరుగుతున్నాయి. ముఖ్యమైన పూజలు, హోమాలను పురోహితులు ఆన్​లైన్​లో కానిచ్చేస్తున్నారు. వీడియో కాలింగ్ ద్వారా మంత్రాలు చదువుతూ కార్యక్రమాలు జరిపిస్తూ.. కాస్తో కూస్తో ఉపాధి పొందుతున్నారు.

online worships due corona effect
ఆన్​లైన్​లోనే పూజలు, హోమాలు

By

Published : May 24, 2020, 12:19 PM IST

కరోనా దెబ్బకు వివాహాది శుభకార్యాలు, పూజలు, వ్రతాలు జరగక పురోహితుల ఆదాయం పడిపోయింది. అయితే కొందరు ఆన్‌లైన్‌ బాట పట్టి కాస్తో కూస్తో ఉపాధి పొందుతున్నారు. కరోనా రాకముందూ.. విదేశాల్లోని తెలుగువారి కోరిక మేరకు ఇక్కడి పురోహితులు ఆన్‌లైన్‌లో ఒకటీ అరా శుభకార్యాలు నిర్వహించేవారు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఈ ధోరణి కొంత పెరిగింది. పెళ్లిళ్లు తప్ప.. గృహప్రవేశాలు, నామకరణాలు, వ్రతాలు, హోమాలు ఆన్‌లైన్‌లో జరిపించేస్తున్నారు. ఇలాంటి వారికి వీడియో కాల్స్‌, గూగుల్‌ మీట్‌, జూమ్‌ లాంటివి బాగా ఉపయోగపడుతున్నాయి.

ఇటీవల రాష్ట్రంలో ఒక వృద్ధురాలు మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారంతా అమెరికా, బ్రిటన్‌లో ఉంటారు. తల్లి మరణంతో వారు ఉదకశాంతి, నారాయణ హోమం చేయాలనుకున్నారు. 4 కుటుంబాలకు చెందిన 12 మంది.. ‘గూగుల్‌ మీట్‌’తో అనుసంధానమయ్యారు. పురోహితుడూ అందులోనే మంత్రపఠనం చేశారు.

విదేశాల్లోనే కాకుండా, మన దేశంలో ఉన్నవారూ కొందరు ఆన్‌లైన్‌లో పూజలు, వ్రతాలకు మొగ్గు చూపుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం లాక్‌డౌన్‌ సమయంలో వారి నివాసంలో రుద్రాభిషేకం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఇద్దరు పురోహితులు ఆ కార్యక్రమం చేయించారు.

విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ సింగపూర్‌లో కెమిస్ట్‌గా పనిచేస్తూ ఇల్లు కొనుక్కున్నారు. ఏప్రిల్‌ 17న గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నారు. తమ ఇంటి పురోహితుల్ని తీసుకెళ్లాలనుకున్నారు. అంతలో లాక్‌డౌన్‌ మొదలైంది. పురోహితుల్ని సంప్రదించి.. ఆన్‌లైన్‌లోనే కార్యక్రమం జరిపించాలని కోరారు. తెల్లవారుజామున 3 గంటలకు ముహూర్తం. ఇక్కడి పురోహితులు ట్యాబ్‌ పట్టుకుని కూర్చుంటే.. అక్కడ శ్రీనివాస్‌ కుటుంబం మంత్రాలు వింటూ గృహప్రవేశం చేసింది.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు దంపతులకు బాబు పుట్టాడు. అతని జన్మనక్షత్రం ప్రకారం శాంతిహోమాలు, పూజలు చేయాలని పురోహితులు సూచించారు. అమెరికాలో పురోహితులున్నా, వారిని ఇంటికి పిలిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని పురోహితుల్ని సంప్రదిస్తే.. వారు ఆన్‌లైన్‌లోనే కార్యక్రమం జరిపించారు.

"ఆన్‌లైన్‌ పూజకు మామూలు కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడి నుంచి మేం చెప్పింది.. అక్కడివారు అర్థం చేసుకుని దానికి తగ్గట్టు చేయడంలో కొన్ని సమస్యలున్నాయి. విదేశాలకు, ఇక్కడికి సమయాల్లో తేడా ఉంది. అయినా ఈ విధానం కొంత ఉపాధి కల్పిస్తోంది’’ అని కొందరు పురోహితులు పేర్కొన్నారు. సాధారణంగా విదేశాల్లో ఉండేవారు ఇక్కడికి వచ్చినప్పుడు పూజలు, వ్రతాలు చేస్తుంటారని, ఇప్పుడు ఎటూ కదల్లేక అక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. పూజలు చేయించిన పురోహితులకు సంభావన.. నెట్‌ బ్యాంకింగ్‌, గూగుల్‌పే లాంటి మార్గాల్లో వచ్చేస్తోంది.

ఇవీ చదవండి:

మరో రెండున్నర నెలలు కీలకం- మాస్కులే శ్రీరామరక్ష!

ABOUT THE AUTHOR

...view details