గుంటూరు దిశా పోలీసు స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది కిరోసిన్ బాటిల్ లాగేసి అతనిని రక్షించారు. పాత గుంటూరుకు చెందిన కరీముల్లాకు.. అతని భార్యకు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త రోజు తాగి వచ్చి వేధిస్తున్నాడని నిన్న కరీముల్లా భార్య గుంటూరు దిశ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది.
ఈరోజు దిశా పోలీస్ స్టేషన్‌కు కౌన్సిలింగ్‌కి వచ్చిన కరీముల్లా స్టేషన్ ఎదుట భార్యతో గొడవ పడ్డాడు. స్టేషన్లో న్యాయం జరగలేదని భావించి.. ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులకు చెప్పాడు. అయితే.. భార్యను బెదిరించడానికే ఇలా చేశాడని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. కరీముల్లా అసలు స్టేషన్ లోకి రాలేదన్నారు.