గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని పెదరావూరు గ్రామానికి చెందిన యార్లగడ్డ విజయ కామేశ్వరి "డయల్ యువర్ ఎస్పీ" కార్యక్రమానికి ఫోన్ చేసి.. తాను పడుతున్న సమస్యను తెలియజేశారు. తన కుమారుడు శివ రాజేశ్ ఆస్తి కోసం వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె ఫోన్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేసి వాపోయారు. తనపై దాడి చేసి ఇంట్లో సామాన్లు, గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లాడని.. న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఎస్పీ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న ఆ ప్రాంత సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందితో కలిసి బాధితురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి తల్లిని వేధిస్తున్న కుమారుడిపై కేసు నమోదుకు సీఐ శ్రీనివాసులు అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. కుమారుడు కామేశ్వరి వద్దనుంచి బలవంతంగా తీసుకు వెళ్లిన వంట సామాగ్రిని పోలీసులు తిరిగి ఇప్పించారు. అతనిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. శివ రాజేశ్‌ను పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులను పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత కుమారులపై ఉందని సీఐ వెల్లడించారు.