గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య 18, 868కి చేరుకుంది. సోమవారం ఒక్కరోజే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 257 కేసులు నమోదయ్యాయి. అలాగే నర్సరావుపేట 43, సత్తెనపల్లి 40, పిడుగురాళ్ల 34, మాచర్ల 29, బాపట్ల 21, మంగళగిరి 18, దాచేపల్లి 14, తెనాలి 14, మేడికొండూరు10, వట్టిచెరుకూరులో 10, పిట్టలవానిపాలెం 9 కేసులు వచ్చాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 71 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 10వేల మంది కోలుకున్నారు. దాదాపు 3వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో 60శాతం మందికి పైగా హోం ఐసోలేషన్‌లో ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లాలో కరోనా నియంత్రణ, రోగులకు చికిత్సకు సంబంధించి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వైరస్ బారిన పడిన తర్వాత... పరిస్థితి తీవ్రరూపం దాల్చాక కొందరు ఆసుపత్రులకు వస్తున్నారని... అలాంటి వారే మరణిస్తున్నారని కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ తెలిపారు. అలాంటి వారిని గుర్తించేందుకు కంటైన్మెంట్ జోన్లు, నాన్ కంటైన్మెంట్ జోన్లలో అధిక రిస్క్ ఉన్నవారిని గుర్తించి పల్స్ ఆక్సీమీటర్‌తో రోజుకు రెండు సార్లు తనిఖీ చేయాలని వాలంటీర్లకు ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాల కంటే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులలో బెడ్ల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షించాలని, పాజిటివ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా ఆసుపత్రులు, పడకలను పెంచాలని ఆయన సూచించారు. కరోనా చికిత్సకు వినియోగించే ప్రాణ రక్షక మందులతో పాటు ఇతర మందుల స్టాకుని ప్రతి రోజు సరిచూడాలన్నారు.