Objections on Increase in NTR Stadium Membership Fee: నిర్వహణ మరిచారు.. సభ్యత్వ రుసుము పెంచేశారు.. ఎన్టీఆర్ స్టేడియంలో సభ్యత్వం రూ.30 వేలు Objections on Increase in NTR Stadium Membership Fee:ఆటలకు, ఆహ్లాదకర వాతావరణానికి వేదికగా ఉండే గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ఇటీవల క్రీడేతర అంశాలతో విమర్శలు ఎదుర్కొంటుంది. 1999లో బృందావన్ గార్డెన్స్ కూడలిలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సాధన చేసిన ఎంతోమంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో గుంటూరు స్పోర్ట్స్ హబ్‌గా ఈ స్టేడియం గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంతకాలంగా మౌలిక సదుపాయాల కల్పనపై శీతకన్ను వేయడంతో ఎన్టీఆర్ స్టేడియం తన వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నూతనంగా 400 మందిని శాశ్వత సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సభ్యత్వ రుసుము సైతం 20 వేల నుంచి 30 వేలకు భారీగా పెంచుతూ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ నేతృత్వంలోని కమిటీ విధి విధానాలను ఖరారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
Bills Payment Dispute in Guntur Municipal Corporation: గుంటూరు నగరపాలక సంస్థలో బిల్లుల వివాదం.. పలుకుబడి ఉన్నోళ్లకే పైసలు
ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంకు సంబంధించి కౌన్సిలర్లకు ఉచితంగా సభ్యత్వం ఇచ్చే ఆనవాయితీ ఉంది. వారి పదవీకాలం ముగిసిన తరువాత ఒకరికి 2 వేల 500, కుటుంబానికి 5 వేలు రుసుం కట్టించుకునేవారు. అదేవిధంగా ప్రారంభంలో 5 వేలు రుసుము చెల్లిస్తే సాధారణ పౌరులకు ఈ స్టేడియంలో శాశ్వత సభ్యత్వం ఇచ్చేవారు. ఆ తరువాత 10 వేలు, ఆ తదనంతరం 20 వేలకు సభ్యత్వ రుసుము పెంచారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో వ్యక్తిగత సభ్యత్వానికి 20 వేలు రూపాయలు, కుటుంబసభ్యులందరికీ కలిపి 35 వేల రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడా రుసుంను ఒకరికి అయితే 30 వేలు, కుటుంబం మెుత్తానికి అయితే 50 వేలుగా నిర్ణయించారు. దాదాపు నాలుగు వందల మంది కొత్తవారికి ఈ శాశ్వత సభ్యత్వాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గిరి నేతృత్వంలోని కమిటి దాదాపు ఖరారు చేసింది.
Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
ఇప్పుడు ఉన్నవారికే కనీస వసతులు, క్రీడా సదుపాయాలు కల్పనలో ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో కొత్తవారికి సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా చేరేవారికి జీవితాంతం సభ్యత్వం ఉంటుంది. వీరు స్టేడియంలో వివిధ రకాల క్రీడలు ఆడుకోవడంతో పాటు జిమ్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. స్కేటింగ్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ షటిల్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్ వినియోగించుకోవాలంటే క్రీడాకారులకు సభ్యత్వం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సభ్యత్వ రుసుం మీద ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల క్రీడాకారులు, క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Pipe Line Leakage Sewage into Colonies : 'మేం మనుషులం కాదా.. మమ్మల్ని ఇలాగే వదిలేస్తారా..?' మూడ్రోజులుగా 'మురుగు'తున్న పేదలు
షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్టుల్లో పలు సమస్యలున్నాయని, స్కేటింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ ట్రాక్ సంబంధించి మౌలిక సదుపాయలు సరిగా లేవని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో లైట్లన్నీ వెలగడం లేదని, జనరేటర్ రిపేర్ వచ్చినా పట్టించుకునేవారే లేరంటున్నారు.. స్టేడియం రుసుముల ఖరారుపై కమిటీ ప్రతిపాదనల్ని ఎమ్మెల్యే గిరిధర్ కమిషనర్ ముందుంచారు. అయితే రుసుములను పెంచడంపై కొందరు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. కౌన్సిల్ సభ్యులకు ఉచితంగా సభ్యత్వం కల్పించాలని కోరితే ఏకంగా ఫీజులు పెంచటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీస మౌలిక వసతులు గురించి పట్టించుకోకుండా సభ్యత్వ రుసుం పెంచడం పట్ల అన్నివర్గాల నంచి వ్యతిరేకత వస్తోంది. కమిటీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.