NTR Statue Inauguration At Kunkalagunta:గుంటూరు జిల్లా కుంకలగుంటలో ఏర్పాటు చేసిన.. 12 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయడు, జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది అని రామానాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. చెత్త మీద పన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అని రామానాయుడు దుయ్యబట్టారు. ధాన్యం గురించి అడిగితే రైతులను జైలుకు పంపిస్తున్నారన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఏదీ అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధి, ఉద్యోగం లేక యువత అల్లాడిపోతున్నారన్నారు.
ఎన్టీఆర్ జీవితమే ఓ ప్రభంజనమని పయ్యావుల కేశవ్ అన్నారు. ఎన్టీఆర్‌కు ఓ కులాన్ని ఆపాదించడం సరికాదని హితవు పలికారు. కులాల పేరుతో గ్రామాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయబోతున్నారని ఎద్దేవా చశారు.