గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి... మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు... గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్... కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
లోకేశ్ స్పందన...
ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసానికి ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. వైకాపా నేత కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే దాడి: అచ్చెన్నాయుడు
ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ఈ ఘటన మద్యం మత్తులో జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని ఆక్షేపించారు. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.