NTR Savaneer Committee Met CBN at Hyderabad: ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ నెల 20వ తేదీన NTR పై ప్రత్యేక సంచికను, వెబ్ సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు చంద్రబాబుతో సమావేశం అయ్యి చర్చించారు. కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ కార్యక్రమ నిర్వహణను ఆయనకు వివరించారు. కమిటీకి చంద్రబాబు పలు సలహాలు, సూచనలు చేశారు.
అనంతపురంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు: ప్రాంతీయ పార్టీగా పెట్టి జాతీయస్థాయి పార్టీగా తెలుగుదేశంను మార్చిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వేడుకలను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన అనంతపురం నగరంలోని కమ్మభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నేతలంతా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.