ప్రజారాజధానిగా అమరావతే ఉండాలంటూ 15 రోజుల పాటు రైతులు చేస్తున్న దీక్షలకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రైతుల ఆందోళనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండి... దీక్షల్లో పాల్గొనడం రైతులు, మహిళల్లో మరింత స్ఫూర్తిని నింపింది.
ఉద్యమానికి మద్దతుగా చేతి గాజు విరాళం
మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతు నిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. మహిళలు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం తానెప్పుడూ చూడలేదని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా అమరావతి కలను నెరవేర్చుకుందామని మహిళలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతుగా తన చేతి గాజును విరాళంగా అందజేశారు. రైతుల దుస్థితి చూడలేకపోతున్నానంటూ ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అమరావతి సాధించేవరకూ రైతుపక్షాన పోరాడతామని తేల్చిచెప్పారు.