'ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతారు' అని ఓ సినిమాలో మహేశ్‌బాబు చెప్పాడు. అయితే.. అంతకు ఎన్నో ఏళ్ల ముందే.. ఈ పెద్దాయనకు ఆ ఆలోచన స్ఫురించింది. తదనుగుణంగా అడుగులు వేసి ఊరివాసుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఆయనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరుకు చెందిన పట్టెల శివశంకర్.
పెదకొండూరులోనే ఎంటెక్ వరకూ చదివిన శివశంకర్.. అనంతరం ఉన్నతవిద్యకు విదేశాలకు వెళ్లారు. 20 ఏళ్ల పాటు అక్కడే పనిచేశారు. స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న ఆలోచన.. ఆయనను తొలిచేసేది. అప్పటికే పెదకొండూరుకు ఉన్నత పాఠశాల మంజూరైనా.. భవనాల నిర్మాణానికి నిధుల్లేవు. గ్రామస్థులు శివశంకర్‌ను సంప్రదించారు. గ్రామంలో హైస్కూల్ లేకపోవడం వల్ల వేరే ఊరికి నడిచి వెళ్లి చదువుకున్న తన చిన్నతనాన్ని గుర్తుచేసుకున్న శివశంకర్.. నిర్మాణానికి అవసరమైన 70లక్షలు సమకూర్చారు. పాఠశాలలో కంప్యూటర్లూ పెట్టించారు. సీసీ కెమెరాలూ ఏర్పాటు చేయించారు. ఇలా బడి బాగు కోసం కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు.