ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాన్‌పిక్‌ ప్రాజెక్టు ప్రాంతంలో సాగు చేయొద్దంటూ నోటీసులు - వాన్‌పిక్‌ ప్రాజెక్టు ప్రాంతంలో సాగు చేయొద్దంటూ నోటీసులు

వాన్‌పిక్‌ భూముల వ్యవహారం మరోమారు చర్చల్లోకి వచ్చింది. తీర ప్రాంతమైన నిజాంపట్నం, ఆముదాలపల్లి, అడవులదీవి, దిండి గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను రైతులు విడిచి పెట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 1240 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Notices for cultivation in the VanPick project area
వాన్‌పిక్‌ ప్రాజెక్టు ప్రాంతంలో సాగు చేయొద్దంటూ నోటీసులు

By

Published : Oct 7, 2020, 2:18 PM IST

తీర ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ‘ఓడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్‌ కారిడార్‌(వాన్‌పిక్‌)’ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. సముద్ర తీరంలో ఓడ రేవుతో పాటు పరిశ్రమల కారిడార్‌ను దాదాపు రూ.16,750 కోట్లతో రూపకల్పన చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతంలో దాదాపు 25 వేల ఎకరాల వరకు భూమిని సేకరించాలని ప్రతిపాదించారు. రెండు జిల్లాల సరిహద్దులో పోర్టు అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పార్కు, మెరైన్‌ పార్కు, రసాయన పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నింటినీ సమకూర్చేందుకు 2008 మార్చి 11న ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అవసరాలకు జిల్లాలోని నిజాంపట్నం మండలంలో అసైన్డ్‌, ప్రైవేట్‌, అటవీ భూములను ఐదు వేల ఎకరాల వరకూ గుర్తించారు. అయితే ఆయా భూముల సేకరణ విషయంలో పెద్దఎత్తున దుమారం రేగింది. భూములకు పరిహారం అందించే విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

సేకరించిన భూములకు రూ.30 వేల నుంచి రూ.1.25 లక్షల మేర చెల్లింపులు చేశారని ఆరోపణలు చేశారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలుగా చూపారని అప్పట్లో ప్రతిపక్షాలు, వామపక్షాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఆ అంశం సీబీఐ విచారణకు వెళ్లింది. ఈ నేపథ్యంలో నిజాంపట్నం ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన భూముల్లో 2వేల ఎకరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆధీనంలోకి తీసుకుంది. వివాదంలో ఉన్న ఆయా భూముల్ని స్థానికంగా ఉన్న కొందరు రైతులు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్నారు. పదేళ్లకుపైగా ఆ భూముల్లో పంటలు పండించడంతో పాటు కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు రైతుల ఆధీనంలోనున్న భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో యంత్రాంగం కదిలింది. మంగళవారం జేసీ దినేష్‌కుమార్‌ తీర ప్రాంతంలో పర్యటించి రైతుల స్వాధీనంలో ఉన్న 1240 ఎకరాల భూమిలో సాగు చేయకూడదని, తక్షణం ఖాళీ చేసేలా నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి: విస్తరిస్తున్న వైద్య, ఫార్మా రంగం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details